28, సెప్టెంబర్ 2009, సోమవారం

విజయ దశమి నాడు ప్రారంభం

డియర్ విజిటర్స్,
నా పేరు ఎస్.రాము. నేను ఒక ఇరవై సంవత్సరాల పాటు తెలుగు జర్నలిజంలో పని చేశాను. తెలుగు, ఇంగ్లీష్ పేపర్లలోడెస్క్ లో, ఫీల్డ్ లో పనిచేసాను. వృత్తిలో ఒత్తిళ్ళతో పాటుగా ఫీల్డ్ లో గొట్టాలు (వివిధ చానల్స్ లోగో మైక్ లు) ఎక్కువఅయ్యాయి. ప్రెస్ కాన్ఫరెన్స్ లో కెమెరామెన్ బ్యాక్ లు ఎక్కువగా చూడాల్సి వచ్చింది.

అది ఫర్వాలేదు కాని చాలామంది మిడిమిడి జ్ఞానం గాళ్ళు పవిత్రమైన ఫీల్డ్ లో చొరబడ్డారు. వారిదే హవా. విలేకర్ల నేతలూ వారే. రాజకీయ నేతలఏజెంట్లూ వారే. కుల సంఘాలను ప్రోత్సహించేదీ వారే. బతికి వుంటే టీచెర్ గా బతక వచ్చని పారిపోయాను. ఇప్పుడుయువ జర్నలిస్టును తయారుచేసే పనిలో వున్నాను. ఈనాడులో నేను రాసిన ఎడిట్ పేజి వ్యాసాలు, ది హిందూలో రిపోర్టర్ గా చేసిన పని ఆనందాన్ని ఇచ్చేవే. ఈనాడు జర్నలిజం స్కూల్, వుస్మానియా యూనివర్సిటీ, ఏసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం లలో చదివిన చదువు, రెండు గోల్డ్ మెడల్స్, అమెరికా పర్యటనకు వచ్చిన ఫెలోషిప్ నాకు తృప్తిని ఇచ్చే అంశాలు. ఇది సొంత సొద కం పరిచయం.

నిజాలను నిర్భయంగా చెప్పే బ్లాగ్ ఒకటి తెలుగులో వుంటే బాగుంటుందని చాలా రోజులుగా అనుకుంటున్నాను. విజయ దశమిరోజు (సెప్టెంబర్ ) బ్లాగ్ ప్రారంభించాను. నా అనుభవాలు మీతో పంచుకోవాలన్నది ప్రాధమిక వుద్దేశం. తెలుగుజర్నలిజంలో చాలా బాగా పనిచేస్తున్న ప్రతిభావంతులకు కొదవే లేదు కానీ వారు మరుగున పడి పోతున్నారన్న బాధ నన్ను వేధిస్తున్నది.
జలగలలాంటి బాస్ పుణ్యాన వేరే వృత్తి లోకి పలాయనం చిత్తగిస్తున్నవారి సంఖ్యా పెద్దదే. యాజమాన్యాల అఘాయిత్యాలు, పవర్ లాబీల దుర్మార్గాలు మన బ్లాగ్ లో దర్శనమిస్తాయి. గలగల లాడే తెలుగు రాసేవారితో పాటు జలగల ఆగడాల గురించి రాయడం కూడా నా అభిమతమే.

అయితే దొంగ రాతలు, పిచ్చి పుకార్లు (మాగురువు గారు బూదరాజు గారి భాషలో 'పునకార్లు') రాసి తీట తీర్చుకోను. ఎందుకు బాధ పెడుతున్నావని జలగనుఅడిగి రాయడం, బాధపడావద్దని బాధితుడిని దార్చడం నా కర్తవ్యం గా భావిస్తున్నాను. జర్నలిజం పరిణామాలనుకూడా రాయాలని అనుకుంటున్నా ను. మంచి చర్చలు కూడా నిర్వహించాలని వుంది. జర్నలిజం పని నిత్యం సత్యాన్నివెలికితీయడమే కదా! పనే మనం చేద్దాం. నాకు కుల, మత, ప్రాంత లంకెలు అంటకట్టకుండా మీరంతాసహకరించండి. మంచి కోసం పాటు పడండి. బ్లాగ్ ను ఒక వేదికగా చేసుకోండి.
మీకు విజయ దశమి శుభాకాంక్షలు
మీ
రాము